ఆంధ్రమేవ జయతే…!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం హైదరా బాద్ లోని ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ తెలంగాణా సారస్వత పరిషత్ మారిన తరువాత, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వెలుగులు కొనసాగించాలన్న సదుద్దేశంతో 2017లో నేను అధ్యక్షుడుగా, డా॥ కడిమిళ్ళ వరప్రసాద్, శ్రీ మేడికొండ శ్రీనివాస్ లు ఉపాధ్యక్షులుగా, శ్రీ చక్రావ ధానుల రెడ్డప్ప ధవేజీ కార్యదర్శిగా, శ్రీ రాయప్రోలు భగవాన్ కోశాధికారిగా, శ్రీ పొన్నపల్లి రామారావు, శ్రీ మంతెన రామకుమార్ రాజులు సంయుక్త కార్యదర్శులుగా సంస్థను భీమవరంలో రిజిస్ట్రేషన్ చేయించి, తాత్కాలిక కార్యాలయంలో మా కార్యక్రమాల నిర్వహణ ప్రారంభించాం. తెలుగు భాషా వికాసమే ధ్యేయంగా ‘ఆంధ్రమేవ జయతే!’ అన్న నినాదంతో తెలుగు (ఆంధ్ర) భాషా వైభవం వైపు మా సేవలు ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయిల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. కోవిడ్ కారణంగా జూమ్ అంత ర్ణాల కార్యక్రమాలు పెక్కు నిర్వహించాం. అనేక సామా జిక, సాహితీ సంస్థలతో కలసి పని చేయడం ప్రారంభించాం.
ప్రపంచ తెలుగు మహాసభల స్థాయిలో ఒక కార్య క్రమం చేద్దామని మా పరిషత్ సభ్యులు అభిప్రాయపడ్డారు. భీమవరంలోనే అంతర్జాతీయ తెలుగు సంబరాలు 2022లో నిర్వహించాలని ఏకగ్రీవ తీర్మానం జరిగింది. ఆ దిశగా అడుగులు వేశాం. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోరాదని గట్టి నిర్ణయం తీసు కున్నాం. శ్రీ రాయప్రోలు భగవాన్ను సంబరాల ప్రధాన కార్యదర్శి ఉండమని కోరగా ఆయన అంగీకరించారు. సంబరాల నిర్వహణా సభ్యులను ఏర్పరచుకొని కార్యా చరణకు సిద్ధమయ్యాం. మిత్రులు శ్రీ మహేశ్ వర్మ సహ కారంతో సంబరాలకు పెదఅమిరంలోని వెస్ట్ బెర్రీ పాఠశాల వేదిక అయ్యింది. శ్రీరామపురంలో సంబరాల కార్యాలయం ప్రారంభించాం. అనేకమంది అతిథులను, సాహితీవేత్తలను స్వయంగా వెళ్లి అహ్వానించాం.
2022 జనవరి 3వ తేదీన తెలుగు భాషా వైభవ శోభాయాత్ర, 6వ తేదీన పూర్ణకుంభ పురస్కారాల సభ, 7, 8 తేదీలు సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, దాతలకు సత్కారాలుగా నిర్ణయించుకున్నాం. సదస్సుల, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణా బాధ్యతలు శ్రీ రాయప్రోలు భగవాన్ గారు, పూర్ణకుంభ పురస్కారాల సభ బాధ్యత లయన్ శ్రీ కృష్ణంరాజు గారు, శ్రీమతి సురేఖ గజల్ శ్రీనివాస్ లు, శోభాయాత్ర శ్రీ కేశిరాజు రామప్రసాద్, ప్రాంగణం, ఆతిధ్యాలను శ్రీ మేడి కొండ శ్రీనివాస్, శ్రీ మేడికొండ రామదాసు, అభిరుచి వంశీలు, రవాణా, వసతి నిర్వహణ శ్రీ అడ్డాల వాసుదేవ రావు, శ్రీ శ్రీకాంత్లు, ప్రచారం శ్రీ వొడుపు గోపీ, కవి సమ్మేళనం డా.ఎస్.ఆర్.ఎస్. కొల్లూరిలు స్వీకరించి గొప్ప ప్రణాళిక చేసి, సమిష్టి కృషితో ఎంతో విజయవంతం చేశారు.
తెలుగు భాషలోని అనేక ప్రక్రియలపై నిష్ణాతులైన వారిని ఆహ్వానించి 21 పైగా సదస్సులు, అవధానం, శాస్త్రీయ, వాద్య, లలిత, చలన చిత్ర, జానపద సంగీతం, హరికథ, బుర్రకథ, కూచిపూడి, ఆంధ్ర నాట్యం, పౌరాణిక, సాంఘిక నాటకాలు, ఏకపాత్రాభినయాలు, భజనలు ఇలా ఎన్నో కళా రూపాలు ప్రదర్శిత మయ్యాయి. మన సాహితీ, కళా వైభవాన్ని చాటి చెప్పాయి.
అనుకున్నట్టుగానే, మా ప్రణాళికను సాకారం చేసు కోగలిగాం. నిజంగానే సంబరాలు అంబరాన్ని తాకాయి. ఊహించిన దానికన్నా గొప్ప స్పందన వచ్చింది. 40 దేశాల నుండి ప్రతినిధులు వచ్చారు. 100 మందికి పైగా రాష్ట్ర తర తెలుగు సంఘాల వారు హాజరయ్యారు. వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసాం. తెలంగాణా నుండి వందలాది మంది కవులు, భాషాభిమానులు రావడం మరింత ఉత్సాహం నింపింది. వేలాదిమంది తెలుగు భాషాభి మానులతో, కవులతో, పండితులతో, అతిధులతో, పాత్రికేయ మిత్రులతో ప్రాంగణం కళకళలాడిపోయింది. నేను కలగన్నట్టుగా, మా సభ్యులు ఊహించినట్టుగా ‘తెలుగు సంబరాలు’ మహోన్నతమైన విజయం సాధిం చడం మాకు ఎంతో ఆత్మానందాన్ని కలిగించింది.
తెలుగు “బడి భాషే కాదు, అమ్మ ఒడి భాష” గా మనం ముందుకు తీసుకు వెళ్లాలని, ప్రభుత్వానికి “తెలుగు అధికార భాష అయితే సరిపోదు, ప్రజలకు మమకార భాష” కావాలన్న నా మాటతో అందరూ ఏకీభవించడం మాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది.
ప్రతి అతిథిని మంగళ వాయిద్యాలతో, వేదాశీస్సు లతో పూర్ణకుంభంతో స్వాగతం పలికాం. గోపూజ నిర్వ హించాం. మొక్కలు నాటించాం. సదస్సులు, సాంస్కృ తిక కార్యక్రమాలు ఎంతో జనరంజకంగా జరిగాయి. తెలుగుతోరణం నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలి చింది. పూర్తి స్థాయిలో సాంకేతిక సాధనాలతో వేదికను, షుమారు 7,000 మంది కార్యక్రమాలు వీక్షించేటందుకు కుర్చీల ఏర్పాట్లు జరిగాయి. ప్రాంగణం అంతా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశాం.
విశేషంగా, ప్రవేశ రుసుము లేకుండా అందర్నీ అను మతించాం. అల్పాహారం, భోజన సదుపాయం, గోదావరి జిల్లాల పిండివంటలు భోజనప్రియుల్ని ఆనందపరచాయి. త్రాగునీరు సదుపాయం పెక్కుచోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమ చికిత్సా కేంద్రం, అంబులన్స్ సదు పాయం ఏర్పాటు చేసాం. ఉచిత రవాణా సదుపాయం, వసతి ఏర్పాట్లు చేసాం. ఎన్.ఎస్.ఎస్ విద్యార్థుల సేవ ప్రశంసనీయం.
పుస్తక ప్రదర్శనలు, ఆయుర్వేద, ప్రకృతి వైద్య మందుల ప్రదర్శనలు, తెలుగు వైభవ చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సంచార జాతుల కళారూపాలు ప్రజల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ఎంతో మంది వదాన్యుల దగ్గరకు వెళ్లి సంబరాల గురించి చెప్ప గానే నన్ను ఎంతో ఆదరించి వెంటనే ఆర్ధిక సహాయం చేసారు. వారందరి పాదాలకు సాగిలపడి మ్రొక్కుతున్నాను. వారందరినీ హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా సత్కరించుకునే భాగ్యం కలిగింది.
నాపై ఎంతో దయతో విచ్చేసిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహా స్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర స్వామికి సదా కృతజ్ఞుణ్ణి.
మొదటి రోజు అనివార్య కారణాలవల్ల రాలేకపోయినా, ఆత్మీయ సందేశం పంపిన ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడి గారికి నా కృతజ్ఞతలు. సందేశాలు పంపిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారికి, లోక్సభ అధిపతి శ్రీ ఓం బిర్లా గారికి ధన్యవాదాలు.
నా ఆహ్వానాన్ని మన్నించి తెలుగుభాష ఉద్యమంలో అందరమూ భాగస్వాములమే అని, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి, 6వ తేదీన పూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మిజోరం గవర్నర్ శ్రీ కె. హరి బాబు గారికి, 7వ తేదీన ముఖ్యఅతిథిగా విచ్చేసిన హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి, ఆంధ్ర ప్రదేశ్ ఉప శాసన సభాధిపతి శ్రీ కోన రఘుపతి గారికి, 8వ తేదీ సమాపనోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసన సభాధిపతి శ్రీ తమ్మినేని సీతారాం గారికి, హైకోర్ట్ న్యాయ మూర్తి జస్టిస్ ఆకుల శేషశాయి గారికి ఎప్పటికీ కృతజ్ఞుణ్ణి.
ఎంతో ఆదరించిన శ్రీ పాతపాటి సర్రాజు గారికి ఏమి ఇచ్చినా ఋణం తీర్చుకోలేను
