కొత్తగూడెం డిసెంబర్ 20;
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ నిర్వహణలో తెలుగువారి అనురాగ సంగమంగా
2026 జనవరి 3 4 5 6 తేదీలలో గుంటూరులో అత్యంత వైభవోపేతంగా జరుగనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల గోడ పత్రికను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజల్ కవి, తెలుగు మహాసభల కవి సమ్మేళన సమన్వయకర్త రాజేష్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ని తెలుగు మహాసభలకు రావలసిందిగా కోరుతూ ఆత్మీయ ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలుగు మహాసభలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు తూముల శ్రీనివాస్, దూడల బుచ్చయ్య, మొహమ్మద్ ముస్తఫా, సయ్యద్ అబ్దుల్ నజీర్, రజిత తదితరులు పాల్గొన్నారు.
అనంతరం కవి రాజేష్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో తెలుగు కవులు కళాకారులను ఒక వేదిక మీదికి తీసుకువచ్చే దిశగా డాక్టర్ గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్నాయని, ఈ మహాసభలలో
యువ అవధానులచే అవధానాలు, వేలాదిమంది విద్యార్థిని విద్యార్థులచే తెలుగు వైభవ సాంస్కృతిక ప్రదర్శనలు, హరికథా, బుర్రకథ, పద్య నాటకం, సాంఘిక నాటకం, జానపద కార్యక్రమం, శాస్త్రీయ లలిత సంగీతం, చలనచిత్ర సంగీతం, కూచిపూడి, చలనచిత్ర నటులచే హాస్య కదంబరి, సాహితీ సదస్సులు, వీధి నాటకాలు, కవి సమ్మేళనాలు, సంచార జాతుల కళాకారుల కార్యక్రమాలు, పురాతన నాణేల ప్రదర్శన, తెలుగు కార్టూన్ల ప్రదర్శన, ఆంధ్ర వైభవ చిత్రలేఖన ప్రదర్శన, లఘు చలనచిత్ర ప్రదర్శనలు,
తప్పెటగుళ్లు, కోలాటాలు, పద్య శతకాల సామూహిక పఠనం, తెలుగు వెలుగుల శిల్పారామం, తోలుబొమ్మలాటలు వంటి అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, అందరూ మహాసభలలో పాల్గొనవచ్చని తెలిపారు.
